నాలో నేను
అప్పట్లో ఒకడుండే వాడు
ఒక్కడే ..ఒంటరే
సినిమా తెర మీద బొమ్మల భావావేశాలు చూసే చాటుగా కన్నీళ్లు తుడుచుకునేవాడు
సాదా సీదా గా సాగిపోయే "బచ్ పన్ " లో హీరోలది ఒక పవర్
ఆకాశం నుండి దిగివచ్చే దేవకన్యల గురుంచి మరెన్ని ఊహా లో !
ఏ లోకాన్ని గెలుచుకోవాలో అర్థమయ్యేది కాదు
చుట్టుముట్టే కలల ప్రపంచం లో కలవరపాటే ఎక్కువ
నాన్న సైకిల్ మీదే నాలుగు దిక్కులు వెతికే వాడిని
సన్నని కాలిబాటలు విశాలమైన గడ్డి మైదానాల మధ్య
నా వెర్రి తనాన్ని ఆకాశం ఒక్కటే గుడ్లప్పగిచ్చుకొని గమనించేది
మేఘాలు నా దిగులుని మోసుకు తిరుగాడుతుండేవి
ఆకు పచ్చని అందమేదో ఎడతెగని ముచ్చట పెడుతూనే ఉండేది
అప్పటికే చీకటి కమ్మేసి నన్ను వెనక్కి లాక్కెళ్లేది బలవంతంగానే
అయ్యో అన్నీ చెప్పేస్తున్నావే !
ఓయ్ ... నీ గురుంచి ఏదీ చెప్పటానికి సరిపోను
నీ కోపాన్ని ప్రేమ లాగే దిగమ్రింగుకుంటాను
కొన్ని సరిపడవు నాకూ ... నీకు మల్లే
ఈ మాట ఇంత తొందరగానే చెప్పాలని కూడా లేదు
కానీ ఎదో హిమశిఖరం కరిగి నీరైపోయినట్టు మనసు గారాలు పోతుంది.
నీ ప్రేమ ..నీ స్వేచ్చ .. రెండు రెండే ..
చాలా విస్తృతమైనవే ..
దేని పరిధి ని కుదించలేను
నీ ఆనందాన్ని అసలే భగ్నపరచలేను