(జులై 2,చెర సంస్మరణ)
శ్రమజీవి అంతర్జాతీయ గీతం
చెరబండరాజు
**************
'ప్రపంచ పురోగతి సాంతం క్రమజీవి నెత్తుటి బొట్టులోనే ఇమిడివుంది' అని..
ప్రకటించిన చెరబండరాజు ప్రపంచ పురోగమనంలో శ్రమజీవి నిర్వహించిన పాత్రను చారిత్రకంగానూ, శాస్త్రీయంగానూ అర్థం చేసుకున్నాడు. ఎన్నో కవితల్లో పాటల్లో ఆ అవగాహనను ఎలుగెత్తిచాటాడు.
భూగోళం మీద జీవరాశి ఏర్పడినప్పటినుంచి ఆహారాన్వేషణ సాగుతున్నది. ఆహారాన్వేషణలో శ్రమ పాత్రయే మిగిలిన ప్రాణి కోటినుంచి మనుషులకు ఆకృతినిచ్చింది. మనిషి తొలిరూపమయిన గొరిల్లా తన ముందటి కాళ్లను ఆహారాన్వేషణలో ఉపయోగించే నైపుణ్యం పెంచుకున్న క్రమంతో తొలిమానవాకృతి ఏర్పడింది. పనిలో కరచరణాదుల ఉపయోగం, అవయవాల నిర్మాణానికి, ప్రత్యేక పనులకు ఎట్లా పరిణితి చెందిందో అట్లే మనిషి మెదడు అభివృద్ధి చెంది , బుద్ధి వికసించింది. ఊహించే, సృజించే శక్తి వచ్చింది.
చాలామంది భ్రమపడేట్లు బుద్ధి, ఊహాలు శ్రమను నిర్దేశించవు. శ్రమయే బుద్ధి. ఊహ, సృజన శక్తి వికసించడానికి తోడ్పడుతుంది. కనుక ప్రపంచ పురోగమనం అనేది బానిస సమాజం నుంచి పెట్టుబడిదారీ (ఒక స్వప్నం ఫలించి ఒక విశాల భూ ఖండంలో కొన్ని దశాబ్దాల పాటు) సమాజం ఏర్పడే వరకు కూడా శ్రమజీవి నెత్తురు చెమటలో, ఎక్కువ సార్లు నెత్తురే చింది ఏర్పడిన నాగరికతయే సాధించిన అభివృద్ధియే, సహజవనర్లు, భూమి, నీళ్లు, ఖనిజాలు వంటివి ప్రకృతిలో ఉన్నవనరు ఒక గింజ ఎన్నో గింజలకాయగా, ఒక పిడికెడు ధాన్యం-పుట్టెడు ధాన్యంగా పండే రహస్యం-మినహాయిస్తే ఈ వనర్లన్నింటినీ సమకూర్చుకుని ఎన్నోరెట్ల సంపదలను సృష్టించే శక్తి మాత్రం మానవ శ్రమకే ఉంది.
శ్రమజీవి నెత్తుటి బొట్టు ఏమేమి సాధించి ప్రపంచ పురోగమనానికి బాటలు వేసిందో చెరబండరాజు ఎల్లకులాలకు క్రమజీవి అంతర్జాతీయ గీతమనదగిన పాటలో స్పష్టంగా చెప్పాడు.
కొండలు పగలేసినం
బండలను పిండినం
మానెత్తురు కంకరగా
ప్రాజెక్టులు కట్టినం
శ్రమ ఎవడిదిరో
సిరి ఎవడిదిరో
బంజర్లను నరికినం
పొలాలను దున్నినం
మా చెమటలు ఏరులుగా
పంటలు పండించినం
గింజెవడిదిరో
గంజెవడిదిరో
మగ్గాలను పెట్టినం
పోగు పోగు వడికినం
మా నరాలె దారాలుగా
గుడ్డలెన్నో నేసినం
ఉడుకెవడిదిరో
వణుకెవడిదిరో
యంత్రాలను తిప్పినం
ఉత్పత్తులను పెంచినం
మా శక్తే విద్యుత్తుగా
ఫ్యాక్టరీలు నడిపినం
మేడ ఎవడిదిరో
గుడిసెవడిదిరో
కారణాలు తెలుసుకుంటే శ్రమనుంచే సిరి వచ్చిందనీ, నెత్తురే కంకరుగా ప్రాజెక్టులు నిర్మాణమయ్యాయని, చెమటలే ఏరులుగా బంజర్లు పొలాలై పంటలు పండాయని, గంజితాగి, అదికూడ దొరకక పేగులెండిపోగా, కష్టం చేసినవాళ్లే గింజలు పండించారని, శ్రమశక్తియే విద్యుచ్చక్తియని అర్ధమవుతోంది. ఒక్కసారి కారణాలు తెలిసి శ్రమజీవికి ఈ అవగాహన ఏర్పడితే ఆ పనిముట్లే ఆయుధాలవుతాయి. శ్రమజీవులు పరాయికరణ పొందిన తమ శ్రమనేకాదు, శ్రమఫలితాన్ని, అధికారాన్ని కూడా హస్తగతం చేసుకుంటారు. ఆ విశ్వాసాన్ని ఇచ్చే గొప్ప గీతాన్ని చెరబండరాజు ఇచ్చాడు.
శ్రమజీవి గురించి ఇంత శాస్త్రీయమైన అవగాహనతో రాసిన చెరబండరాజు నలగొండ జిల్లా, అంకుశాపురం గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో పుట్టాడు. తల్లి పదినెలలు మోసి ఎంతో కష్టంతో కన్నబిడ్డ గనుక తండ్రి ఆయనను శెరాబందిరాజుతో పోల్చాడు. బక్కయ్య, బక్కరెడ్డి అని పేరుపెట్టాడు. స్కూల్లో చేర్చేప్పుడు టీచర్ భాస్కరరెడ్డిగా మార్చాడు. అంకుశాపురంలో, ఘటుకేసరులో చదువుకొని, హైదరాబాదులో నల్లకుంట కళాశాలలో తెలుగు ఎంఒఎల్ చేసి 1965లో దిగంబర కవితా ఉద్యమం ప్రారంభించినపుడు ఆయన తండ్రి పోల్చిన పేరుకు దగ్గరగా చెరబండరాజు అని తన కలంపేరు ఎంచుకున్నాడు. ఆశ్చర్యంగా ఆయన 1971 నుంచి 77 దాకా చెరబండరాజు కింగ్ ఆఫ్ ప్రిజన్ స్టోన్( ఈ శీర్షికతో అమెరికానుంచి వెలువడే గార్డియన్ పత్రికలో ఆయన గురించి ఒక పరిచయవ్యాసం1982లోవచ్చింది) గానే రాజీలేకుండా పోరాడిన జగమొండిగా జీవించాడు.
ఈ బక్కయ్యను చిన్నతనంలో తన వెంటపెట్టుకొని తండ్రి పొలం దగ్గరికి తీసుకువెళ్ళేవాడు. మోటకడుతూ..
ఏటికేతంబెత్తి వెయిపుట్లు పండించి
గంజిలో మెతుకెరుగరన్నా..
అని గొంతెత్తి పాడుకునేవాడు. ఆ పసి మనసులో ఆ రైతు జీవితం అట్లా ఒక దృశ్యమైంది. అందుకే కవిగా చెరబండరాజు.. ఈ మట్టి నాకు పట్టెడన్నం పెట్టి పాలు తాపిందని , రాక్షస భూస్వామ్య రంపపు కోతనుంచి ఈ మట్టిరుణం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసాడు.
ఇవ్వాళ మనం విద్యుత్ చార్జీల పెంపుదలతో, ఆ పుదలకు వ్యతిరేకంగా జరిగిన విశాల ప్రజా ఐక్య ఉద్యమంపై దారుణమైన అణచివేతలో చాలా స్పష్టంగా ప్రపంచ బ్యాంకు ఆదేశాలను, సామ్రాజ్యవాద కుట్రను పోల్చుకుంటున్నాం. ఈ సామ్రాజ్యవాద స్వభావం గురించి చెరబండరాజు 1968లోనే వందేమాతరమ్' గీతం రాసాడు. ఈ దేశాన్ని పాలిస్తున్న దళారీపాలకులు మాతృభూమి, తల్లి భారతి అంటూనే అంతర్జాతీయ విపణిలో (ఆమె) అంగాంగం తాకట్టు పెట్టారని..
'ఒంటిమీద గుడ్డలతో జెండాలు కుట్టించి వివస్త్రగా ఊరేగిస్తున్నారని
'అప్పుతెచ్చి వేసినమిద్దెల్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది,
ఎండిన స్తనాలమీదికి ఎగబడ్డ బిడ్డల్ని
ఓదార్చలేని శోకం నీది
అమ్మా భారతీ ! నీ గమ్యం ఏమిటి తల్లీ!
అని ప్రశ్నించాడు. ఈ దళారీల పాలనలో ఆమె గమ్యం ఏమిటో స్పష్టమే అయింది. కారణాలు తెలిసిన శ్రమజీవులేం చేయాలో కూడ చెరబండరాజే చెప్పాడు.
తరతరాల దోపిడీని తలవంచక ఎదిరించిన
ప్రాణమెవడు త్రాణఎవడు
అని 'కార్మికుడు' గీతంలో రాసాడు
యీపు మీద బియ్యం సంచి
కడుపేమో ఖాళీ సంచి
అని హమాలీ గురించి
గింజ గింజ లెక్కగట్టి
సేటుగాడు కాటేస్తడు
కిలోల్లెక్క కూలడిగితే
వాడు బతుకు కాజేస్తడు ..
అని కూలీ గురించి పాట రాసాడు.
ఒక్కమాటలో చెప్పాలంటే చెరబండరాజు సాహిత్యమంతా శ్రమజీవి గురించిరాసిందే. శ్రమజీవి నెత్తుటి బొట్టు లొనే ప్రపంచ పురోగమనం ఉందనే అవగాహనతో రాసాడు గనుకనే నెత్తుటి బొట్టును కూడా ప్రజల విముక్తి కోసం ఏళ్లతరబడి జైలు నిర్బంధాన్ని, తీవ్రమైన బ్రెయిన్ ట్యూమర్ అనారోగ్యాన్ని కూడ లెక్కచేయకుండా కవిత్వం,కథలు, నవలలు, నాటికలు రాసాడు.
చెరబండరాజు.. రాజుల సంస్కృతిని కాదని ప్రజల సంస్కృతి గురించి పాడాడు . రాసాడు. ఏది నమ్మాడో అదే రాసాడు. ఏది రాసాడో ఆ ఆదర్శానికి అనుగుణంగా ఆచరించాడు . జీవించాడు. ఆ క్రమంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలిచాడు. తన విశ్వాసాల కోసం, రచన కోసం జైలు పాలయ్యాడు. ఎమర్జెన్సీ చీకటి నిర్బంధాన్ని అనుభవించాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే గాంధీ 'రోగ నిలయం'లో (గాంధీ ఆసుపత్రి) కేన్సర్తో బాధపడుతూ నెలల తరబడి గడిపాడు. కోమాలోకి వెళ్లి కన్నుమూసాడు. సికింద్రాబాద్ - కుట్ర కేసులో ముద్దాయిగా జైలు సంకెళ్ళనే లయ బద్ధంగా మోగిస్తూ..
ఈ మట్టిని తొలచుకొని విప్లవాలు లేస్తున్నాయి
ఎరుపెక్కిన మట్టికి మానెత్తుటి లాల్ సలామ్'
అని కటకటాలనుంచి గొంతెత్తి పాడాడు.
జైలు, కోర్టు, ఆసుపత్రి-ఎక్కడయినా ప్రజల గురించి ఆలపిస్తూనే ఆఖరి శ్వాసదాకా బతికాడు.
ఆగస్టు పదిహేను ద్రోహాన్ని చెప్పకపోతే
అన్నం సహించదునాకు
ఏరోజైనా
ప్రజా పోరాటాల విషయాన్ని రచించకపోతే
ఆరోజు జీవించి నట్టుండదు
అని రాసిన చెరబండరాజు పీడిత పోరాట ప్రజలకు చిరస్మరణీయుడు.
- వరవర రావు
(శ్రమజీవి,జులై-సెప్టెంబర్,2001 లో ప్రచురితం)
9, జులై 2025, బుధవారం
శ్రమజీవి-3
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి