8, జూన్ 2021, మంగళవారం

నిద్రనెలా నిందించను..

నిద్రనెలా నిందించను..  


 నేనైతే శుభ్రంగా అన్నీ  సర్దుకుని 

నా టైం ప్రకారమే ,

అదే అర్ధరాత్రే లెండి 

పక్క ఎక్కేసాను 

చీకటి కురుల్లో కుదురుగా 

మల్లెపువ్వుల్లా ముడుచుకుపోయాను 

కనురెప్పల్నీ చీకటి కాటుక తోనే 

అతికించేశాను 

కానీ ..ఏది నిద్ర ?

రమ్మంటే రాదే చెలియా 

దాని కథ ఎదో అప్పుడే మొదలయినట్టుంది 

పురుసత్ గా ఎవరెవరినో తట్టి లేపుతుంది

కలిసినప్పుడు అనలేక 

మింగేసిన మాటల్ని 

ఇప్పుడు కక్కేస్తుంది 

అద్దమ  రాతిరి  మద్దెల దరువు లా.. 

ఎలా ఆపేది దీన్ని ?

పైగా నన్నే దబాయిస్తుంది 

చాల్లే !మధ్యాహ్నం పూట ఓ కునుకేశావ్ గదా !

ఎప్పుడూ నిద్ర ముఖమేనా ? 

మడిసన్నాక కాస్త కళా పోసన వుండాలోయ్ !

అంటూ ..  నా చెయ్యి పట్టుకొని 

గాలిలో షికార్లు కొట్టిస్తుంది 


పైపైనే చూసి వదిలేసిన చాలా వాటిని 

మళ్ళీ మరింత లోతుగా చూపిస్తుంది 

తన కంటి చూపు తోనే 

కొత్త అర్థాలను వివరిస్తుంది 

అప్పటికే నాలో ముసుగు తన్ని పడుకున్న 

కవి  మిత్రుడికి నిద్రాభంగం అవుతుంది 

జమ్మిచెట్టు మీద దాచిన ఆయుధాలను 

దించుకున్నట్టు 

కాగితం ,కలాన్ని పొదివి పట్టుకుంటాడు 

చీకటి కురుల్ని సవరిస్తూ 

ప్రియురాలి నీలికళ్ళపై 

విరహ గీతం రాసుకుంటాడు 

ఇంతలోకే .. తన పంతం 

నెరవేరిందని కాబోలు .. నిద్ర 

 కాఫీ తాగొస్తానని చెప్పి తుర్రుమంటుంది 


అప్పటి దాకా తన మానాన తను 

ఒక మూల దాక్కున్నదోమ ఒకటి 

నా మీదకి దాడికి దిగింది 

"ఏక్ మచ్చర్ ఆద్మీ కో 

హిజడా బనా దేతా హై "


నా నిద్ర కి ఇది రోజు అలవాటు 

చెప్పలేదని నా మీద నింద  మోపేరు .. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి